పల్నాడు యుద్ధం నిజంగా జరిగిందా?? యుద్ధానికి కారణాలు ఏంటి?

భారతీయ చరిత్రలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు అన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వాటి గురించి వినడం, తెలుసుకోవడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలనాడు ప్రాంతంలో జరిగిన పల్నాడు యుద్ధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే బ్రహ్మనాయుడి పేరు కూడా ఎంతో గొప్పగా వెలిగింది. నిజంగానే పల్నాటి యుద్ధం జరిగిందా?? దానికి కారణాలు ఏంటి?? 

పల్నాటి యుద్ధం నిజంగా జరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరిగింది చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర గ్రంధాలలో కూడా పూర్తి వివరాలతో వ్రాయబడింది.

పలనాడు (ఈనాటి గుంటూరు జిల్లా ) వెలనాటిచోడుల సామంతులైన హైహయ వంశస్థులు (యాదవులు) అధీనంలో ఉండేది.పలనాటి పరిపాలకుడు 'అనుగురాజు' వెలనాటి గొంకరాజు కుమార్తె అయిన మైలాంబను వివాహం చేసుకుని తన పరపతిని పెంచుకున్నాడు. వారిద్దరికి  నలకామ/నలగామ అనే కొడుకు పుట్టాడు. అతడికి మరో ఇద్దరు భార్యలు. వాళ్ళ  పేర్లు వీరవిద్యా దేవి, భూరమదేవి.

వీరవిద్యా దేవి కొడుకులు పెద మలిదేవ, చిన మలిదేవ, బాల మలిదేవ. 

భూరమ దేవి కొడుకులు కామరాజు,నరసింగ రాజు, జత్తి రాజు, పెరుమాళ్ళు రాజు. 

అంతఃపుర కలహాలతో అనుగురాజుకి పరిస్థితి దుర్భరంగా మారింది. ఆఖరికి అనుగు రాజు హత్య చేయబడ్డాడు. అతడి మరణం తరువాత క్రీ.శ.1170లో నలగామ' పల్నాడు పాలకుడయ్యాడు. కానీ అతడు తన మంత్రియైన రేచర్ల బ్రహ్మనాయుడి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. రేచర్ల బ్రహ్మ నాయుడు వెలమ కులస్థుడు. ఆనాడు ఆంధ్ర దేశంలో వీర వైష్ణవ, వీరశైవ మతాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. బ్రహ్మ నాయుడు వీరవైష్ణవ మతావలంబి. ఆ మతాన్ననుసరించి, వేర్వేరు కులాలమధ్య బేధాలు తొలగించి, సహపంక్తి భోజనాలు, దళితులకు ఆలయప్రవేశం చేయించడం మొదలైన సామాజిక సంస్కరణలు చేపట్టాడు .నలగామకు ఇవన్నీ రుచించలేదు. అతడు తమ హైహయ వంశీకులందరి వలె శివభక్తుడు. ఈలోగా బ్రహ్మనాయుడు నలగామ సవతిసోదరులను మంచిచేసుకున్నాడు. నలగామ కి నచ్చజెప్పి పెదమలిదేవకు చిన్న సంస్థానం వంటిది ఇప్పించాడు. తరువాత బ్రహ్మనాయుడి సహాయంతో ఆ చిన్నరాజ్యం బాగా అభివృద్ధి చేసి మాచెర్ల రాజధానిగా చేసుకున్నాడు.

ఈలోగా నలగామరాజు దగ్గర నాగమ్మ అనే రెడ్డి కులానికి చెందిన స్త్రీ నాయకురాలిగా చేరింది. ఆమె శివభక్తురాలు. మాచెర్ల అభివృద్ధి చెందడం చూసి, అది చేజిక్కించుకోవడానికి నలగామ, నాగమ్మలు పధకం ప్రకారం పెదమలి దేవుడిని కోడిపందాలకి ఆహ్వానించారు. పందెంలో తన రాజ్యం ఓడిపోయాడు పెదమలిదేవుడు. అందువల్ల 7 సంవత్సరాలు రాజ్యం విడిచిపెట్టి ఏడు సంవత్సరాలయ్యాక బ్రహ్మనాయుడు రాజైన పెద మలిదేవుడికి రాజ్యం తిరిగి ఇవ్వాలని కోరాడు. కానీ నలకామ అందుకు ఒప్పుకోలేదు. ఈ కారణం వల్ల సవతి సోదరుల మధ్య యుద్ధం మొదలయింది.

క్రీ.శ.1185 లో కారెంపూడిలో నాగులేటి ఒడ్డున మహా సంగ్రామం జరిగింది. నలకామ పిలుపుకి స్పందించి కాకతీయులు, హోయసల, కోట, కాలచూరి, వెలనాటి చోడులు యుద్ధంలో పాల్గొన్నారు. మూడురోజుల్లో ముగిసిన యుద్ధంలో పెద మలిదేవుడు పక్షం ఓడిపోయింది. తనవారందరూ మరణించడంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు పలనాడుని శాశ్వతంగా విడిచిపెట్టి తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం వెలనాటి చోడులకు తమ సామంతులపై నియంత్రణ కోల్పోయారని లోకానికి వెల్లడైంది. ఈ బలహీనత గ్రహించిన కాకతీయులు 12 శతాబ్ధం చివరికల్లా కోస్తాంధ్ర ప్రాంతాన్ని కాకతీయ రాజ్యంలో భాగం చేసుకున్నారు.

ఈ యుద్ధంలో గెలిచిన,ఓడిన పక్షాల నాయకులు (ఆంధ్ర నాయకులు) కాకతీయ రాజ్యంకి వలసపోయి, కాకతీయ సైన్యంలో నాయకులుగా ప్రసిద్ధి చెందారని, వారే కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లింల దాడిని ఎదుర్కోవడానికి 'నాయక సమాఖ్య' గా ఏర్పడ్డారని చరిత్రకారుల కధనం.

ఓడిపోయిన బ్రహ్మనాయుడి పేరు అంత గొప్పగా ఎందుకు మారింది అనే సందేహం అందరికీ వస్తుంది. ఆ కాలానికే కులమతాలను పక్కనపెట్టి అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టినవాడు బ్రహ్మనాయుడు. ఆయన్ను ఒక సంఘసంస్కర్తగా చెప్పుకోవచ్చు. 

◆వెంకటేష్ పువ్వాడ.